నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడుదల చేసిన పోలీసులు
- విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అయ్యన్నను అరెస్ట్ చేసిన పోలీసులు
- విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణుల ఆందోళన
- ఎలమంచిలి వద్ద అయ్యన్నను విడిచి పెట్టిన పోలీసులు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను పోలీసు వాహనంలో తరలించారు. అనంతరం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయను విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నకు 41 (ఏ) నోటీసులు ఇచ్చి ఆయనను విడిచి పెట్టారు. అనంతరం నక్కపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఉన్న కాగిత జాస్ హోటల్ కు అయ్యన్న, టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.