విషమంగానే డి. శ్రీనివాస్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స

  • సిటీ న్యూరో సెంటర్‌‌లో చేరిన మాజీ ఎంపీ
  • శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేత
  • హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సిటీ న్యూరో ఆసుపత్రి
రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సీనియర్ కాంగ్రెస్ అగ్రనేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా ఆయనను ఐసీయూలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. 

ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆయనకు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు కూడా ఉన్నాయని, వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని, మరో 48 గంటల‌ పాటు పరిశీలన అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు సిటీ న్యూరో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దాంతో, డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.


More Telugu News