ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర

  • చంద్రబాబు త్వరగా విడుదల కావాలని వెంకన్నకు మొక్కులు
  • 60 మంది కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ నడక
  • వేల కోట్లు దోపిడీ చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు
ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వెంకన్నను దర్శించుకునేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరారు. సుమారు 230 కిలోమీటర్ల ప్రయాణాన్ని వారం రోజుల్లో పూర్తిచేయనున్నట్లు వారు తెలిపారు. ఈమేరకు టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జి ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యకర్తలు 60 మందితో కలిసి ఈ యాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం ప్రొద్దుటూరులోని తన నివాసం నుంచి యాత్ర మొదలు పెట్టారు. 

తిరుమల పాదయాత్ర ప్రారంభిస్తూ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడే చంద్రబాబుపై జగన్ కక్షగట్టి జైలుకు పంపించాడని ఆయన మండిపడ్డారు. కుట్ర చేసి అర్ధరాత్రి అరెస్టు చేశారని ఆరోపించారు. తను జైలుకు వెళ్లొచ్చానని మిగతా వారిని జైలుకు పంపిస్తున్నాడని విమర్శించారు. వేల కోట్ల ప్రజాసొమ్మును కాజేసింది జగనేనని విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఓటు రూపంలో ప్రజలే ఆయనకు బుద్ది చెబుతారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ బయటకు తీస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు.



More Telugu News