మెక్సికోలో ఏలియన్స్ బాడీలపై నాసా ఏమన్నదంటే..!

  • పరిశోధన జరిపాకే అవేంటనేది చెప్పగలమని వెల్లడి
  • యూఎఫ్ఓలపై ప్రత్యేక రిపోర్టు విడుదల చేసిన నాసా
  • ఈ రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్ నియామకం
గ్రహాంతర వాసుల అవశేషాలంటూ మెక్సికో పార్లమెంట్ లో ప్రదర్శించిన శిలాజాలపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తాజాగా స్పందించింది. మెక్సికోలో ప్రదర్శించిన శిలాజాలకు సంబంధించి తమకు ఎలాంటి శాంపుల్స్ అందుబాటులో లేవని, పరీక్షలు జరపకుండా అవేంటనేది చెప్పలేమని పేర్కొంది. ఇలాంటి అసాధారణ వస్తువులు, ఇతరత్రా ఆబ్జెక్ట్స్ ఏవైనా గుర్తించినపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులకు నమూనాలు పంపించాలని నాసా యూఏపీ డైరెక్టర్ డేవిడ్ స్పెర్గల్ చెప్పారు. అసాధారణ విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు. మెక్సికో చెబుతున్న గ్రహాంతరవాసుల అవశేషాలకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్ లో చూడడమే తప్ప ఇతర విశేషాలు ఏవీ తెలియవని చెప్పారు. అందుకే అవేంటనే విషయంపై తాము స్పందించలేమని వివరించారు.

గుర్తుతెలియని ఎగిరే వస్తువు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్) గా వ్యవహరించే అన్ ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్ (యూఏ పీ) లపై నాసా తాజాగా ఓ కొత్త రిపోర్టును విడుదల చేసింది. ఈ విషయంలో సాధారణ ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో యూఏపీ పరిశోధన కోసం ప్రత్యేకంగా కమిటీ వేసినట్లు ప్రకటించింది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్ మెంట్ మాజీ హెడ్ డేవిడ్ స్పెర్గల్ ను ఈ కమిటీకి డైరెక్టర్ గా నియమించింది. నాసా తాజా రిపోర్టు విశేషాలను డేవిడ్ స్పెర్గల్ గురువారం మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మెక్సికోలో గ్రహాంతరవాసుల అవశేషాలపై మీడియా ప్రశ్నించగా.. పరీక్షలు జరిపాకే అవేంటనేది చెప్పగలమని అన్నారు. అయితే, వాటికి సంబంధించిన ఎలాంటి నమూనాలు తమకు అందుబాటులో లేవని డేవిడ్ వివరించారు.


More Telugu News