పార్టీ నుంచి సస్పెండ్ చేయడమంటే ఇదేనా..?: గోరంట్ల

  • ఎమ్మెల్యేల మీటింగ్ లో వున్న అనంత బాబు ఫొటోను ట్వీట్ చేసిన టీడీపీ నేత
  • దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడంటూ విమర్శలు
  • అలాంటి వ్యక్తిని మీటింగ్ లో కూర్చోబెట్టారు.. సిగ్గుందా జగన్ అంటూ ట్వీట్
దళితుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంత బాబును ఎమ్మెల్యేల మీటింగ్ లో కూర్చోబెట్టడమేంటని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్ లో అనంత బాబును ఎలా కూర్చోబెట్టిందని ప్రశ్నించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమంటే ఇదేనా? అంటూ నిలదీశారు. తన మాజీ డ్రైవర్ మరణానికి కారణం తానేనంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని మీటింగ్ లో కూర్చోబెట్టడానికి సిగ్గుందా జగన్? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ట్వీట్ చేశారు.

అంతకుముందు మంగళవారం కడియంలో జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో ముడిపడిన అనేక ప్రధాన అంశాలను పక్కన పెట్టిన అధికారులు ఒక అధికారి నోట్ ఫైల్ లో రాసిన అంశాన్ని అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించారు. దీనిని ఆధారంగా చూపిస్తూ చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎటువంటి అవినీతికి పాల్పడని చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.



More Telugu News