ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై మరోసారి సీబీ‘ఐ’

  • అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనల ఆరోపణలు
  • సుందరీకరణ  పనుల కోసం కేజ్రీవాల్ దాదాపు రూ. 45 కోట్ల ఖర్చు
  • హోంశాఖ ఆదేశాలతో సీబీఐ విచారణ మొదలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. తన కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర హోశాంఖ ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం కేజ్రీవాల్ దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని, అవకతవకలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నివేదికలో పునర్నిర్మాణంలో ప్రాథమిక అవకతవకలు జరిగాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా మేలో సక్సేనా ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి లేఖ రాశారు. 

ఇంటీరియర్ డెకరేషన్ కు రూ.11.30 కోట్లు, స్టోన్ మార్బుల్ ఫ్లోరింగ్ కు రూ.6.02 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కు రూ.2.58 కోట్లు ఖర్చు చేసినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదికలో ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది. కాగా, ఈ ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. సీఎం ఇంటి నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


More Telugu News