పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • బోర్డు ఏర్పాటును నోటిఫై చేస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం
  • బోర్డు చైర్మన్, సెక్రటరీలను నియమించనున్న కేంద్రం
  • సభ్యులుగా పలు ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పసుపు ఉత్పత్తుల అభివృద్ధి, కొత్త మార్కెట్లు గుర్తించడం ద్వారా ఎగుమతులను పెంచే దిశగా పసుపు బోర్డు కృషి చేస్తుంది. తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

2023 నాటికల్లా పసుపు ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పసుపు బోర్డు పనిచేస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. బోర్డు చైర్‌పర్సన్‌ను కేంద్రం నియమిస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, వాణిజ్య మంత్రిత్వ శాఖలు, ఫార్మాసూటికల్స్ విభాగం అధికారులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. మూడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు రొటేషన్ పద్ధతిలో బోర్డులో సభ్యులుగా కొనసాగుతారు. వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థలు, పసుపు రైతు సంఘాల ప్రతినిధులు, ఎగుమతిదారులు, బోర్డులో మెంబర్లుగా ఉంటారు. బోర్డుకు సెక్రటరీని కేంద్రమే నియమిస్తుంది. 

ప్రస్తుత గణాంకాల ప్రకారం, పసుపు ఉత్పత్తి, ఎగుమతి, వినియోగంలో భారత్ ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 30 రకాలను సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పసుపు ఉత్పత్తిలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.


More Telugu News