వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ కు ప్రేక్షకుల్లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం

  • నేటి నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • అహ్మదాబాద్ లో ప్రారంభ మ్యాచ్... ఇంగ్లండ్, న్యూజిలాండ్ అమీతుమీ
  • మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం
  • స్టేడియం కెపాసిటీ 1.32 లక్షల సీట్లు
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అంటే టోర్నీకి కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హోరు నడుమ, రెండు జట్లు ఉత్సాహంతో తలపడుతుంటే ఆ మజాయే వేరు. కానీ, ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూస్తే ఆ దాఖలాలు కనిపించలేదు. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు వన్డే ఫార్మాట్ లో హేమాహేమీలే. కానీ, 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ అతిపెద్ద స్టేడియంలో ప్రేక్షకులు అక్కడొకరు, ఇక్కడొకరు అన్నట్టుగా కనిపించారు. దాదాపు స్టేడియం అంతా ఖాళీగానే కనిపించింది. 

భారత్ లో వరల్డ్ కప్ టోర్నీ సన్నాహాలు ఆలస్యంగా మొదలుకావడం, టికెట్ల బుకింగ్ లో సమస్యలు కూడా ప్రేక్షకుల లేమికి కారణమైనట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్ లంటే కొన్ని నెలల ముందుగానే టికెట్లు మొత్తం అయిపోవడం గతంలో వెల్లడైంది. కానీ, ఇవాళ్టి  ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ కు ఇప్పటికీ వెబ్ సైట్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నిర్వాహకుల సన్నద్ధత లేమికి ఇది నిదర్శనం అని విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాగా, గుజరాత్ అధికార పక్షం బీజేపీ ఈ మ్యాచ్ కోసం 40 వేల సీట్లను రిజర్వ్ చేసుకున్నట్టు నిర్ధారించింది. ఇటీవల కేంద్ర మహిళా బిల్లును ఆమోదింపజేసుకున్న నేపథ్యంలో, ఆ 40 వేల టికెట్లను మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తామని, వారికి ఉచితంగా లంచ్, టీ కూపన్లు కూడా అందజేస్తామని చెప్పింది. కానీ, ఆ 40 వేల టికెట్ల సంగతి ఏమైందో తెలియదు.

ఇంత పెద్ద క్రికెట్ ఉత్సవంలో ప్రారంభ వేడుకలు లేకుండానే పోటీలు మొదలుపెట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి.


More Telugu News