‘బాబుతో నేను’ అంటూ 24వ రోజు కూడా కొనసాగిన టీడీపీ రిలే నిరాహార దీక్షలు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • 28 రోజులుగా రిమాండ్ లో ఉన్న చంద్రబాబు
  • నిరాహార దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్న టీడీపీ శ్రేణులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేడు 24వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో  టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, పోలీస్ వ్యవస్థను జగన్ తన ప్రైవేటు సైన్యంలా మార్చుకుని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నాడని మండిపడ్డారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి టీడీపీ నాయకుల్ని అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"అధికారంలో ఉండి పోలీసులు, పరదాలు చాటున తిరుగుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రికార్డులకెక్కాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ధైర్యంగా, దర్జాగా ప్రజల్లో తిరిగారు. ఆ అక్కసుతోనే తప్పుడు కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేశారు" అని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు అంతమయ్యే రోజు త్వరలోనే ఉందని, అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో జగన్‌ పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వనున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నిర్దోషిగా విడుదల అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టులు చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీని గద్దె దింపే వరకూ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘బాబుతో నేను’ దీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక డీలక్స్ సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు రోడ్డు మీద పేరుకుపోయిన చెత్తను ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు రేపాకుల శ్రీనివాస్, దర్షిత్‌ల నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ పోలీసులు దీక్ష భగ్నం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 33వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురం తపాలా కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పోస్ట్ కార్డులను చంద్రబాబు నాయుడు గారికి పంపించి సంఘీభావం తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కటకటాలు ఏర్పాటు చేసి, చేతికి సంకెళ్లు ధరించి నల్ల బెలూన్‌లతో నిరసన తెలిపారు. 

పాణ్యంలో గౌడ సోదరుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ సంఘీభావం తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు ఆధ్వర్యంలో మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఇంచార్జి ఆర్.జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నాయి బ్రాహ్మణ సోదరులు అరగుండు, అర మీసంతో నిరసన తెలిపారు. 

రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు. 'బాబుతో నేను' కరపత్రాలను ప్రతి ఇంటికి పంచారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆదోని నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గంగపుత్రులు పడవలో వలతో చేపలు పడుతున్న వేషధారణలో వచ్చి నిరసన తెలిపారు. 

అద్దంకి నియోజకవర్గంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అద్దంకి మండలం కొంగపాడు మీదుగా మణికేశ్వరం గ్రామంలోని శివాలయం వరకు సాగింది. మణికేశ్వరంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పూలమాలవేసి నివాళులర్పించారు. 9 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అనంతపురం రూరల్ మండలంలో టీడీపీ నాయకులు జలదీక్ష నిర్వహించి దాదులూరు శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి, పోతులయ్య స్వామిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. 

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళా వెంకట్రావు, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఎంఏ షరీఫ్, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కాలవ శ్రీనివాసులు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగధీశ్వరరావు, జ్యోతుల నవీన్, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.టి నాయుడు, బి.కె పార్థసారథి, గొల్లా నరసింహాయాదవ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు), వేగుళ్ళ జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి,  గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, భూమ అఖిలప్రియ, పల్లె రఘునాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జులు రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


More Telugu News