తెలంగాణకు భారీగా నగదు తీసుకెళ్తున్నారా? అయితే ఆధారాలు చూపించాల్సిందే!

  • రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం తీసుకెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
  • అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించక తప్పదు
  • ఒకవేళ పట్టుబడితే ఎన్నికలు ముగిశాక ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇచ్చే అవకాశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో నగదు, బంగారం, ఇతర వస్తువుల తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తం తీసుకువెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించవలసి ఉంటుంది. లేదంటే వాటిని సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిశాక వాటికి ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ ఎమర్జెన్సీ, కాలేజీ ఫీజులు, బిజినెస్, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు, ఇతర అవసరాల నిమిత్తం నగదు తీసుకువెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలి.

తెలంగాణలో 148 చెక్ పోస్టులు పెట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు పెద్ద ఎత్తున నగదు వంటివి తీసుకు వెళ్తే తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ నగదు తరలిస్తే కచ్చితంగా ఆధారాలు ఉంచుకోవాలి.

ఆసుపత్రికి వెళ్లే అవసరమైతే రోగికి సంబంధించిన రిపోర్టులు, హాస్పిటల్ రిసీట్, ఇతర డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. వస్తువులు, ధాన్యం విక్రయం సొమ్ము, భూమికి సంబంధించిన నగదు వంటివి ఉంటే ఇందుకు సంబంధించి బిల్లులు దగ్గర ఉంచుకోవాలి. భారీగా నగదు దొరికితే జీఎస్టీ, ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు.


More Telugu News