అయోధ్యలో మారిన మసీదు డిజైన్.. మధ్య ప్రాచ్యంలోని మసీదులను పోలి ఉండేలా సరికొత్త డిజైన్

  • అయోధ్య రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్‌లో నిర్మాణం
  • 5 వేల మంది పట్టేలా సువిశాలంగా నిర్మించనున్న ఐఐసీఎఫ్
  • అక్కడే ఓ చారిటబుల్ క్యాన్సర్ ఆసుపత్రి కూడా
  • నిర్వహించేందుకు అంగీకరించిన వోక్‌హార్డ్ యాజమాన్యం
అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో ఐదెకరాల్లో నిర్మించనున్న మసీదు డిజైన్‌ను మార్చినట్టు ఇండో-ఇస్లామిక్ ఫౌండేషన్ (ఐఐ‌సీఎఫ్) తెలిపింది. రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ మసీదు నిర్మాణానికి ఈ ఐదెకరాలను అప్పగించింది. కొత్త డిజైన్ మధ్యప్రాచ్య దేశాల్లోని మసీదులను పోలి ఉంటుందని ఐఐ‌సీఎఫ్ చౌర్మన్ జుఫార్ ఫరూఖీ తెలిపారు. ఈ మసీదుకు ప్రవక్త పేరుపై మహమ్మద్ బిన్ అబ్దుల్లాగా నామకరణం చేయనున్నారు.

ఈ కొత్త డిజైన్‌ను పూణెకు చెందిన ఆర్కిటెక్ట్ ఫైనల్ చేశారు. గతంలో ప్లాన్ చేసిన మసీదు కంటే ఇది పెద్దగా ఉండనుంది. 5 వేల మందికిపైగా పట్టేంత విశాలంగా దీనిని నిర్మించనున్నారు. ఇందులో 300 బెడ్లతో చారిటబుల్ క్యాన్సర్ ఆసుపత్రిని కూడా నిర్మించనున్నారు. ఫార్మా కంపెనీ వోక్‌హార్డ్ గ్రూప్‌ చైర్మన్ డాక్టర్ హబిల్ ఖోరాకివాలా ఈ ఆసుపత్రిని స్థాపించి నిర్వహించేందుకు అంగీకరించారు. 

ఉత్తరప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరించనున్నారు. త్వరలోనే మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఫరూఖీ తెలిపారు. డెవలప్‌మెంట్ చార్జీగా తాము కోటి రూపాయలు చెల్లించాల్సి ఉండడంతో ప్రతిపాదిత మసీదు, ఆసుపత్రి మ్యాప్ ఇప్పటికీ అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వద్దే ఉన్నాయని ఆయన వివరించారు. కాగా, మసీదు నిర్మించనున్న ధన్నీపూర్ అయోధ్య రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.


More Telugu News