ఎన్నికల్లో పోటీ చేయడంపై నాపై ఒత్తిడి ఉన్న మాట నిజమే: తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్

  • తెలంగాణలో ఈసారి పోటీ చేయాల్సిందేనన్న నేతలు
  • పోటీ చేయకపోతే చేతులారా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నట్టేనని స్పష్టీకరణ
  • క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకోగలనన్న పవన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పార్టీ తెలంగాణ నేతలు నిన్న కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2018 ఎన్నికల్లో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న తమ అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుబట్టలేదని... బీజేపీ విన్నపం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నామని చెప్పారు. 

ఈ సారి మాత్రం పోటీ చేయాల్సిందేనని విన్నవించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని... ఈసారి పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా అడ్డుకున్నట్టు అవుతుందని చెప్పారు. క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని, భవిష్యత్తులో బలంగా వెళ్లడం కష్టమవుతుందని అన్నారు. 

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ... క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తాను కూడా అర్థం చేసుకోగలనని చెప్పారు. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమని.. అయితే జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి, రెండు రోజుల సమయం అవసరమని చెప్పారు.


More Telugu News