జనసేన-టీడీపీ పొత్తు నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • ఎన్నికల్లో కలిసి నడవాలని జనసేన, టీడీపీ నిర్ణయం
  • తాము సీఎం పదవే ముఖ్యమని భావించడంలేదన్న పవన్ కల్యాణ్
  • జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమని వెల్లడి
ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కలిసి నడవాలని జనసేన, టీడీపీ ఓ అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి ముందుకెళ్లాలని జనసేన పార్టీ కార్యకర్తలకు సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని ఉద్బోధించారు. 

వచ్చే ఎన్నికల్లో సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళదామని పవన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయభేరి మోగించాలని, ఆ దిశగానే టీడీపీతో కలిసి వెళుతున్నామని వివరించారు. ఇవాళ తాము సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుందని పవన్ పేర్కొన్నారు. 

రాష్ట్రానికి మనం బలమైన రీతిలో దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంత దూరం వచ్చామని వివరించారు. నాడు 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైందని, ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని వెల్లడించారు. 

పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా తానొక్కడినే తీసుకోవడంలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులేనని అన్నారు. ప్రజల్లో ఉన్న మనోభావాలను, క్రియాశీల సభ్యుల అభిప్రాయాలను పలు నివేదికల ద్వారా తెలుసుకుంటున్నానని వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు.


More Telugu News