నెదర్లాండ్స్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను లాగేసుకున్న శ్రీలంక

  • వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక, నెదర్లాండ్స్ పోరు
  • లక్నోలో మ్యాచ్
  • 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన సదీర సమరవిక్రమ
భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు తొలి విజయం సాధించింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత లంక గెలుపు బోణీ కొట్టింది. ఇవాళ లక్నోలో నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 

మొన్న దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించిన నెదర్లాండ్స్ ఇవాళ కూడా మరో సంచలనం నమోదు చేస్తుందా అన్న చర్చ జరిగింది. అయితే, ఆరెంజ్ ఆర్మీకి శ్రీలంక ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను లాగేసుకుంది. లంక ఇన్నింగ్స్ లో సదీర సమరవిక్రమ ఆట హైలైట్. ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన సమరవిక్రమ 107 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 54, చరిత్ అసలంక 44, ధనంజయ డిసిల్వా 30 పరుగులు చేశాడు. 

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ జట్టు సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్ (70), లోగాన్ వాన్ బీక్ (59) చలవతో 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 4, కసున్ రజిత 4 వికెట్లతో రాణించారు. 

263 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3, వాన్ మీకెరెన్ 1, అకెర్ మన్ 1 వికెట్ తీశారు. 

ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే... నేటి మ్యాచ్ లో శ్రీలంక... నెదర్లాండ్స్ పై గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో మాత్రం నెదర్లాండ్స్ కు దిగువనే ఉంది. నెదర్లాండ్స్ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 1 విజయం సాధించగా, శ్రీలంక కూడా 4 మ్యాచ్ లు ఆడి ఒక విజయం నమోదు చేసింది. అయితే రన్ రేట్ కారణంగా నెదర్లాండ్స్ ఒక మెట్టు పైన నిలిచింది.


More Telugu News