మ్యాచ్‌లో ఆ వికెట్ తరువాతే నాకు నమ్మకం పెరిగింది: షమీ

  • న్యూజిలాండ్ మ్యాచ్‌లో తన ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేసిన ముహమ్మద్ షమీ
  • జట్టులో అద్భుత ఫాంలో ఉన్న వారికి మద్దతివ్వాలని వ్యాఖ్య
  • టీం సమష్టిగా రాణిస్తే విజయం సులభమేనన్న షమీ
  • భారత్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడి
న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగిన ముహమ్మద్ షమీ తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తరువాత మరో నాలుగు కీలక వికెట్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అయితే, మ్యాచ్ సందర్భంగా ఓ టర్నింగ్ పాయింట్ గురించి ముహమ్మద్ షమీ తాజాగా వెల్లడించాడు. 

‘‘తొలి బంతికే వికెట్ తీశాక నాకు నమ్మకం పెరిగింది. జట్టులోని సహచరులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పుడు తప్పకుండా మనం మద్దతు ఇవ్వాలి. టీం సమష్టిగా రాణిస్తే విజయం సాధించడం కష్టమేం కాదు. ఆ సమయంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. మన జట్టు టాప్‌లో ఉండాలని కోరుకోవాలి. ఐదు వికెట్లు తీయడంతో పాటూ భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అని షమీ పేర్కొన్నాడు. 

వరల్డ్ కప్‌‌లో ఇప్పటివరకూ 12 మ్యాచుల్లో 36 వికెట్లు తీసిన షమీ గతంలో అనిల్ కుంబ్లే (31) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం షమీ కంటే జహీర్ ఖాన్ (44), జవగళ్ శ్రీనాథ్ (44) ముందున్నారు. కాగా న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ 10 పాయింట్లతో ఈ టోర్నీలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఎనిమిది పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.


More Telugu News