పార్టీ మారాలనే సూచనలపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

  • సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని స్పష్టత
  • ఏదైనా ఒక పార్టీకే పనిచేయగలుగుతానని వెల్లడి
  • తెలంగాణ ఎన్నికల వేళ ఎక్స్ వేదికగా స్పందించిన విజయశాంతి
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ వస్తున్న అభిప్రాయాలు, సూచనలపై బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. సినిమాల మాదిరిగా రాజకీయాలలో ద్విపాత్రాభినయం సాధ్యపడదని కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పనిచేయగలుగుతానని తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు సూచిస్తున్నారని చెప్పారు. మరోవైపు బీజేపీని విధాన పూర్వకంగా విశ్వసించి 1998 నుంచి పనిచేస్తున్న నేతగా, స్పష్టమైన  హిందూత్వవాదిగా బీజేపీ వైపే నిలబడాలని మరెంతో మంది బిడ్డలు సూచిస్తున్నారని అన్నారు.

నిజానికి ఈ రెండు అభిప్రాయాలు తెలంగాణాలో దుర్మార్గ కేసీఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కోసమే అయినా పార్టీ మారలేనని విజయశాంతి స్పష్టం చేశారు. సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని చెప్పారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలుగుతామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ చేశారు.


More Telugu News