ఎన్నుకున్న ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన ఉంది: రేవంత్ రెడ్డి

  • రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా సోనియా తెలంగణ కల నెరవేర్చారన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయముందని రాష్ట్రం ఇచ్చారన్న టీపీసీసీ చీఫ్
  • తెలంగాణ వచ్చాక అందరికీ నిరాశ ఎదురైందన్న రేవంత్ రెడ్డి
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కల నెరవేర్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయముందని సోనియా భావించారని, అందుకే రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు? ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా? లేదా? ఆలోచించాలన్నారు. నిరసనలు తెలపడానికి కూడా అవకాశం లేకుండా ప్రజల ప్రాథమిక హక్కులను ఈ ప్రభుత్వం కాలరాసిందన్నారు.

తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని, నిధులు వస్తాయని భావించిన వారికి నిరాశ ఎదురైందన్నారు. చివరకు పరీక్షల నిర్వహణలో కూడా టీఎస్‌పీఎస్సీ విఫలమైందన్నారు. కేసీఆర్ కొత్త హామీలు ఇవ్వడం కాదని, పాత హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా యువత ప్రాణత్యాగం చేసిందన్నారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. యువత, రైతులు, మహిళలను అడిగితే కేసీఆర్ పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతో ప్రజల వద్దకు వెళ్తున్నట్లు చెప్పారు.


More Telugu News