యజమాని రాక కోసం.. నాలుగు నెలలుగా మార్చురీ వద్ద శునకం పడిగాపులు!

  • కేరళలోని కన్నూరులో ఘటన
  • అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన యజమాని మృతి
  • మృతదేహాన్ని మార్చురీ రూముకు తరలించిన సిబ్బంది
  • తన యజమాని బతికే ఉన్నాడని, వస్తాడని నాలుగు నెలలుగా ఎదురుచూపులు
యజమాని మృతి చెందిన విషయం తెలియని ఓ శునకం ఆయన వస్తాడని నాలుగు నెలలుగా ఎదురుచూస్తోంది. కేరళలోని కన్నూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. నాలుగు నెలల క్రితం శునకం యజమాని తీవ్ర అస్వస్థతతో కన్నూరు జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో అతడితోపాటు శునకం‘రాము’ కూడా ఆసుపత్రికి వచ్చింది. దాని యజమాని చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ రూముకు తరలించారు. 

ఇప్పటికి నాలుగు నెలలైంది. అప్పటి నుంచి ‘రాము’ అక్కడే యజమాని కోసం వేచి చూస్తోంది. ఆసుపత్రి సిబ్బంది వికాస్ కుమార్ మాట్లాడుతూ.. ఆ శునకం చాలా విశ్వాసం కలదని చెప్పాడు. మార్చురీ రూము బయట అది నాలుగు నెలలుగా వేచి చూస్తోందని, యజమాని ఇంకా బతికే ఉన్నాడని విశ్వసిస్తోందని పేర్కొన్నాడు. ‘రాము’ నిశ్శబ్దంగా కూర్చుంటోందని, ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని తెలిపాడు. 

మృతదేహాలను మరో ద్వారం నుంచి తీసుకెళ్తుండడంతో ఈ డోర్ నుంచి తన యజమాని వస్తాడని భావించి అక్కడే తిరుగుతూ వేచి చూస్తోందని వివరించాడు. తొలుత కొన్ని రోజులుగా ఆ శునకాన్ని అక్కడ గమనించినా పట్టించుకోలేదని, ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందని పేర్కొన్నాడు. తొలుత తాము పెట్టే ఆహారాన్ని అది ముట్టలేదని, ఆ తర్వాత నమ్మకం పెరగడంతో ఇప్పుడిప్పుడే తింటోందని ఆసుపత్రి సిబ్బంది వివరించారు.


More Telugu News