నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపిస్తారు.. కానీ అందుకే కామారెడ్డికి వచ్చా: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ప్రజల భవిష్యత్తును కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్న టీపీసీసీ చీఫ్
  • గజ్వేల్‌లో ఏం చేశాడని కామారెడ్డికి వచ్చాడని ప్రశ్న
  • కేసీఆర్‌కు ఇప్పుడు ఖానాపూర్ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్న
  • ప్రజాప్రతినిధులను అమ్ముడుపోయే సరుకుగా మార్చింది కేసీఆర్ అని విమర్శ
  • ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణకు సిద్ధమా? అని సవాల్
కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర - బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు. కామారెడ్డి తీర్పు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కేసీఆర్ ఏ రోజూ సచివాలయానికి రాలేదన్నారు. కామారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ఎదుటే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు. ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యం కుప్పపైనే కుప్పకూలిపోయాడన్నారు. కామారెడ్డిలో గెలిచి బంగారు తునుక చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, కానీ గజ్వేల్‌లో ఏం చేశావన్నారు. గజ్వేల్‌ను కేసీఆర్ నమ్మించి నట్టేట ముంచారన్నారు.

  గజ్వేల్‌లో నీకు బాగా ఉంటే కామారెడ్డికి ఎందుకు వస్తావ్.. సన్నాసి.. అని నేను అడుగుతున్నా.. అని రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తానంటే కామారెడ్డి ప్రజలు నమ్ముతారా? అన్నారు. కేసీఆర్‌కు ఇప్పుడు తన బంధువుల ఊరు ఖానాపూర్ గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఇక్కడకు వచ్చారన్నారు. గంపా గోవర్ధన్‌ను గంప కింద కమ్మినట్లు... కామారెడ్డి ప్రజలను కూడా గంప కింద కమ్మాలనుకుంటే కామారెడ్డి ప్రజలు ఊరుకోరన్నారు. నీకు బీసీ నేత సీటు కావాల్సి వచ్చిందా? అన్నారు. కేసీఆర్ పోటీ చేయాలనుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల లేవా? న్నారు.

కేసీఆర్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే లక్ష కోట్లు సంపాదించుకున్నారని, ఇప్పుడు మూడోసారి గెలిపించమని చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే పదవులు వచ్చాయన్నారు. మీరు పదవులు అనుభవించేందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారా? ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఉద్యమాలు చేశారా? అని నిలదీశారు. తాను ఎమ్మెల్యేను అవ్వాలంటే తనను ఎక్కడైనా ప్రజలు గెలిపిస్తారని, కానీ కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టాలనే ఉద్దేశ్యంతోనే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నానన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని షబ్బీర్ అలీతో పాటు, తమ పార్టీ అధిష్ఠానం తనకు చెప్పిందన్నారు. 

ఆలుగడ్డ శీను, సబితమ్మ తదితరులను ఏ పార్టీ గెలిపిస్తే... వారు ఏ పార్టీలో ఉన్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్‌కు సిగ్గుంటే... ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ప్రజాప్రతినిధులను అమ్ముడుపోయే సరుకుగా మార్చింది కేసీఆరే అన్నారు. వంద ఎలుకలను తిన్న పులిలా కేసీఆర్ తీరు ఉందన్నారు. కామారెడ్డి భూములను దోచుకునేందుకు బూచోడు వస్తున్నాడన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.  


More Telugu News