ఒకే ఒక్క మ్యాచ్‌తో పలు రికార్డులను చెరిపేసిన రోహిత్‌శర్మ.. గంగూలీ రికార్డు బద్దలు, సచిన్ రికార్డు సమం!

  • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన రోహిత్
  • ఆ ఘనత సాధించిన కెప్టెన్‌గా గంగూలీని రికార్డును అధిగమించి టీమిండియా స్కిప్పర్
  • ప్రపంచకప్‌లలో రెండుసార్లు 500కుపైగా పరుగులు సాధించిన సచిన్‌తో సమానం
  • ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మరో రికార్డు
నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు మరో విజయాన్ని అందించిపెట్టిన టీమిండియా సారథి రోహిత్‌శర్మ పలు రికార్డులను తన పేర రాసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 160 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ 54 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దీంతో ఓ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలుగొట్టాడు. కెప్టెన్‌గా గంగూలీ 2003 ప్రపంచకప్‌లో 465 పరుగులు చేశాడు. 2019లో విరాట్ కోహ్లీ 443, 1992లో అజారుద్దీన్ 332, 1983లో దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్ 303 పరుగులు చేశారు. రోహిత్‌శర్మ 500కుపైగా పరుగులతో ఇప్పుడు వారిని వెనక్కి నెట్టేశాడు.

సచిన్ రికార్డు సమం
ప్రపంచకప్‌లో రెండుసార్లు 500కుపైగా పరుగులు సాధించిన రెండో ఇండియన్‌గానూ రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ప్రపంచకప్‌లలో రెండుసార్లు 500కుపైగా పరుగులు సాధించిన రికార్డు ఇప్పటి వరకు టెండూల్కర్ పేరున ఉండగా ఇప్పుడతడి సరసన రోహిత్ చేరాడు. సచిన్ 1996, 2003 ప్రపంచకప్‌లలో ఈ ఘనత సాధించగా, రోహిత్ 2019 ప్రపంచకప్‌తోపాటు ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆ ఘనత అందుకున్నాడు. వరుస ప్రపంచకప్‌లలో ఆ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు రోహిత్‌శర్మ.

వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు
వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మరో రికార్డు కూడా టీమిండియా సారథి వశమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరున ఉంది. 2015లో ఈ సౌతాఫ్రికా స్టార్ 58 సిక్సర్లు బాదాడు. నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ ఆ రికార్డును అధిగమించాడు. అంతేకాదు, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 503 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు.


More Telugu News