బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ

  • తనది హ్యూమనిజం అన్న పవన్ కల్యాణ్
  • తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలని పిలుపు
  • అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువతకు అండగా ఉంటామన్న పవన్ 
  • ఆంధ్రాలో తిరిగినట్లుగా తెలంగాణలో పూర్తిస్థాయిలో తిరగలేదు కాబట్టి పూర్తిస్థాయిలో మాట్లాడటం లేదని వివరణ
  • ఇప్పుడు అడిగే రోజు... పోరాడే రోజు వచ్చిందన్న జనసేనాని
ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావ్.. మరోసారి బీజేపీతో ఉంటావ్... ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతావ్.. అసలు నీది ఏ ఇజం? అని చాలామంది అంటుంటారని, అయితే తనది హ్యూమనిజమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తనకు తెలంగాణ నేల సనాతన ధర్మం నేర్పింది... నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు తనకు స్ఫూర్తి అన్నారు. గురువారం కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగినట్లు గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నట్లు పునరుద్ఘాటించారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన కేడర్, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ కేడర్ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఎంతో కష్టపడ్డాయని, కానీ ఉద్యమ ఫలితం దక్కలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువతకు జనసేన అండగా నిలుచుంటుందన్నారు. తెలంగాణలో తాను పూర్తి స్థాయిలో తిరగకపోయినా, పార్టీ ఇంకా ఉందంటే కారణం జనసైనికులు, వీర మహిళలే అన్నారు. 

కొత్తగూడెం నియోజకవర్గంలో కార్తిక్ వేముల పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని ప్రశంసించారు. సీనియర్ నాయకులు లక్కినేని సురేందర్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్నప్పుడు అతను స్వచ్ఛందంగా త్యాగం చేసి మద్దతిచ్చాడన్నారు. మొన్న ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పాల్గొన్న సభలో నేను బీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట అనలేదని అంటున్నారని, కానీ తాను అనలేక కాదని, ఆంధ్రాలో లాగా తాను ఇక్కడ పూర్తి స్థాయిలో తిరగలేదని గుర్తు చేశారు. 1200 మందికి పైగా యువత బలిదానాలపై, పోరాటలపై ఏర్పడిన రాష్ట్రం ఇదనీ, అందుకే తాను మాట్లాడలేదని, కానీ జనసైనికులు, వీర మహిళలు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. ఇక్కడ ఎందుకు తిరగలేదని అందరూ అడుగుతున్నారని... అయితే ఇప్పుడు అడిగే రోజు, పోరాడే రోజు వచ్చిందన్నారు. తనకు పునర్జన్మను ఇచ్చిన నేల తెలంగాణ, స్ఫూర్తినిచ్చిన తెలంగాణ, కాళోజీ, దాశరథీ, తెలంగాణ, అవినీతికి ఎదురు తిరిగి రోడ్లమీదకు వచ్చి పోరాటం చేసే యువత అందరికీ జనసేన అండగా ఉంటుందన్నారు.


More Telugu News