ఛేదనలో ఆసీస్ విఫలం... రెండో టీ20లోనూ టీమిండియానే విన్నర్

  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20
  • 44 పరుగులతో విజయం సాధించిన టీమిండియా
  • చెరో 3 వికెట్లతో రాణించిన రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ
  • సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా రెండో టీ20 మ్యాచ్ లోనూ సత్తా చాటింది. ఆస్ట్రేలియాను 44 పరుగుల తేడాతో ఓడించింది. తిరువనంతపురంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. 

టీమిండియా బౌలర్లు రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లతో ఆసీస్ ను దెబ్బతీశారు. అర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు. ఆసీస్ జట్టులో మార్కస్ స్టొయినిస్ చేసిన 45 పరుగులే అత్యధికం. టిమ్ డేవిడ్ 37, స్టీవ్ స్మిత్ 19, మాథ్యూ షార్ట్ 19 పరుగులు చేశారు. 

తొలి టీ20లో సెంచరీ చేసిన జోష్ ఇంగ్లిస్ నేటి మ్యాచ్ లో 2 పరుగులకే అవుటయ్యాడు. ఆఖర్లో ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42 నాటౌట్) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 28న గువాహటిలో జరగనుంది.


More Telugu News