ఆహారం రుచిగా లేదని కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

  • మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగుచూసిన ఘటన
  • మెడపై కొడవలితో దాడి చేశాడని వివరించిన పోలీసుల
  • నిద్రమాత్రలు మింగడంతో నిందితుడికి చికిత్స కొనసాగుతోందని వెల్లడి
రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదనే కారణంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. అనంతరం తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడివున్న అతడిని బంధువులు గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంటి సమస్యల విషయంలో తల్లి, కొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఈ హత్య జరిగిందని పోలీసులు వివరించారు.

మృతురాలి వయసు 55 సంవత్సరాలని, ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, రుచికరమైన ఆహారం పెట్టలేదని తల్లితో కొడుకు గొడవ పడ్డాడని, తీవ్ర ఆగ్రహంతో మెడపై కొడవలితో దాడి చేశాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిందని తెలిపారు. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు యత్నించి నిద్రమాత్రలు మింగాడని చెప్పారు. చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇంకా అరెస్టు చేయలేదని ప్రకటించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో ఈ దారుణ జరిగిందని థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు వివరించారు.


More Telugu News