ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ రాజీనామా.. సామాన్యుడిలా ప్రగతిభవన్ వీడిన వైనం

  • మధ్యాహ్నం 12 గంటలకు ఓటమి ఖరారు కాగానే రాజీనామా
  • మధ్యాహ్నాం 3 గంటలకు ఎంపీ సంతోష్‌కుమార్ వాహనంలో సొంత నియోజకవర్గానికి పయనం
  • కాన్వాయ్, గన్‌మెన్‌లను వెంట రావద్దన్న బీఆర్ఎస్ అధినేత
  • సామాన్యుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి ప్రయాణం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీల గెలుపోటములు తెలిసిన వెంటనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంవో ప్రధాన కార్యదర్శికి లేఖను అందించి గవర్నర్‌కు సమర్పించాలని సూచించారు. ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్ నుంచి తన నియోజకవర్గానికి బయలుదేరారు. 

ప్రగతిభవన్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ దగ్గరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాబోతుండగా వద్దని వారించారు. కాన్వాయ్ లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్‌లు తీసుకోకుండా ఓ సామాన్య పౌరుడిలా ఆయన రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ వాహనంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. వాహనం ముందు సీట్లో సంతోష్‌కుమార్, వెనక సీట్లో కేసీఆర్ మాత్రమే ఉన్నారు. ఆయన వెనుక గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మరో వాహనంలో కేసీఆర్‌ను అనుసరించారు. గన్‌మెన్లను కూడా కేసీఆర్ వెంట రానీయలేదు. 

జనవరి 16 వరకూ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా కేసీఆర్ తొలుత భావించారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విస్పష్ట మెజారిటీ రావడంతో కేసీఆర్ తన నియోజకవర్గానికి వెళ్లిపోయారు.


More Telugu News