వరల్డ్ కప్ ఫైనల్లో ఉపయోగించిన పిచ్ ను 'యావరేజి'గా పేర్కొన్న ఐసీసీ

  • ఇటీవల ముగిసిన వరల్డ్ కప్
  • విజేతగా నిలిచిన ఆసీస్
  • ఫైనల్లో భారత్ ఓటమి
  • ఫైనల్ కు ఉపయోగించిన పిచ్ పై తీవ్ర విమర్శలు
ఇటీవల భారత గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎగరేసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో ఆతిథ్య టీమిండియాను ఓడించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

అయితే ఈ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. టోర్నీలో ప్రతిమ్యాచ్ లోనూ సాధికారికంగా గెలిచిన టీమిండియా... ఆసీస్ తో ఫైనల్ లో మాత్రం డీలాపడిపోయింది. అందుకు పిచ్ కారణం అని, ఇంతకుముందు వాడిన పిచ్ ను ఫైనల్ కు సిద్ధం చేశారని వివిధ రకాల అభిప్రాయాలు వినిపించాయి. 

ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ కు రేటింగ్ ను ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ 'యావరేజి'గా ఉందంటూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, వరల్డ్ కప్ లో భారత్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు ఇలాంటి 'యావరేజి' పిచ్ లపైనే నిర్వహించినట్టు కూడా ఐసీసీ పేర్కొంది. 

కాగా, వరల్డ్ కప్ లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్ నే ఫైనల్ కు సిద్ధం చేశారంటూ ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఆరోపించాడు.


More Telugu News