ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
- మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
- మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
- ఎన్నికల నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకే ముందుగా పరీక్షలు
ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెన్త్ ఎగ్జామ్స్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ... ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని... దీంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఎగ్జామ్స్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా పాసై 100 శాతం ఉత్తీర్ణతను సాధించాలని ఆకాంక్షించారు.