సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష శిబిరానికి వందమంది హిజ్రాలు.. వైసీపీ పనేనంటున్న టీడీపీ నేతలు
- తాటిపర్తిలో మూడు రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష
- దీక్ష శిబిరం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులను చూసి వెనుదిరిగిన హిజ్రాలు
- క్వారీకి దిష్టి తీసేందుకు వచ్చామన్న హిజ్రాల సమాధానంతో టీడీపీ నేతల షాక్
- గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో సోమిరెడ్డి కారు అద్దాల ధ్వంసం
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్దకు హిజ్రాలు పెద్ద ఎత్తున చేరుకోవడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్ట్జ్ను అక్రమంగా తవ్వి తరలిస్తుండడాన్ని అడ్డుకునేందుకు చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
దీనిని అడ్డుకునేందుకు నిన్న సాయంత్రం రెండు బస్సుల్లో దాదాపు వందమంది హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. అయితే, వారి పాచిక పాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. వైసీపీ నేతలే వారిని బస్సుల్లో తీసుకొచ్చి వదిలిపెట్టారని, అక్కడ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీక్ష శిబిరం వద్ద దాదాపు 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండడంతో చేసేదేమీ లేక తిట్టుకుంటూ హిజ్రాలు వెనుదిరిగారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన హిజ్రాలు క్వారీ మొత్తం తిరిగారు. వారిని అడ్డుకున్న టీడీపీ నేతలు ఇక్కడకు ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. క్వారీకి దిష్టి తీసుకేందుకు వచ్చామని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. క్వారీకి దిష్టి ఏంటని ప్రశ్నిస్తే మాత్రం వారి నుంచి సమాధానం రాలేదు.
అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలు వారిని అక్కడకు రప్పించి గలాటా సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే క్వారీలో సిద్ధంగా ఉన్న 12 లారీల తెల్లరాయిని అక్కడి నుంచి దాటించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ తర్వాత కొంతసేపటికి సోమిరెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. కాగా, ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంద్రమోహన్‌రెడ్డి సత్యాగ్రహ దీక్షనను పోలీసులు భగ్నం చేశారు. సోమిరెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటివద్ద వదిలిపెట్టారు.