చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు: లోకేశ్

  • అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ పనికిమాలిన విధానాల్ని రద్దు చేస్తామన్న యువనేత
  • సెలవు, పండుగ, పబ్బం లేకుండా పాదయాత్ర కొనసాగిందన్న లోకేశ్
  • సీఎం కావడానికే పాదయాత్ర అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేత
  • అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
  • వచ్చే ప్రభుత్వంలో తన పాత్ర ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారన్న లోకేశ్
చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు: లోకేశ్
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ పనికిమాలిన విధానాలను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 226 రోజులపాటు కొనసాగింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద నేడు ముగింపు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. దాదాపు ఆరు లక్షల మంది దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. యువగళం క్యాంప్ సైట్‌లోనే ఉన్న ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.

తన పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెట్టిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర ప్రారంభం కాకముందే జీవో-1 తీసుకొచ్చిందని, మైక్, వాహనం, సౌండ్‌బాక్స్ అన్నీ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దీవెనలే తనను నడిపించాయని అన్నారు. ఎండావాన అన్నింటికి తట్టుకుని పాదయాత్ర చేశానని, శని, ఆదివారాలు, పండుగలుపబ్బాలు చూసుకోలేదని తెలిపారు. తన పాదయాత్రలో ప్రజల్లో మార్పు వచ్చిందని, కుర్రోడు కష్టపడ్డాడని, సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రెడ్ డైరీలో ఉన్న పేర్లపై న్యాయవిచారణ
అధికారంలోకి వచ్చాక దారితప్పిన పాలనను గాడిలో  పెడతామని తెలిపారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తన పాదయాత్ర ఉపయోగపడితే చాలని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను రెడ్‌డైరీలో రాసుకున్నామని, అధికారంలోకి రాగానే వారిపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని, సర్వీసు నుంచి తొలగించడంతోపాటు అవసరమైతే జైలుకూ పంపిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై చర్యలకు, కక్ష సాధింపు చర్యలకు మధ్య చాలా తేడా ఉందని స్పష్టం చేశారు.

కట్టుబాట్లు తెంచేసి వ్యక్తిగత విమర్శలు
జగన్ కుటుంబ సభ్యులను తామెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని, కానీ వైసీపీ నేతలు కట్టుబాట్లు తెంచేసి తమ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని తెలిసి కూడా ఆయనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. వారిని చంద్రబాబు వదిలిపెడతారని తానైతే అనుకోవడం లేదన్నారు. జగన్ పాలనలో ఇసుక, మద్యం, భూసేకరణలో అనేక తప్పులు జరిగాయని, అన్నింటికీ తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

అధికార కాంక్షతో పాదయాత్ర చేసేవారు జగన్‌లా తయారవుతారు
పాదయాత్రలో తామిచ్చిన హామీల్లో 80 శాతం అభివృద్ధికి సంబంధించినవేనని, వీటిలో చాలావరకు టీడీపీ హయాంలో ప్రారంభించినవేనని, జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపివేశారని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావడానికే పాదయాత్ర చేశానన్న వాదనను లోకేశ్ కొట్టిపడేశారు. అధికార కాంక్షతో పాదయాత్ర చేసేవారు జగన్‌లా తయారవుతారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన పాత్ర ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. 

పెట్టుబడిదారులకు నమ్మకం కలిగేది అప్పుడే
వచ్చే ఎన్నికల్లో 160 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే అప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం వస్తుందని, రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని, ఏపీలో సుపరిపాలన ఉంటుందన్న విశ్వాసం వారిలో కలుగుతుందని అన్నారు. అప్పుడు ప్రజలే ఆశ్చర్యపోయేలా ఏపీని అభివృద్ధి చేసే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలీసులు కూడా జగన్ ప్రభుత్వ బాధితులేనన్న లోకేశ్.. వారిలోనూ మార్పు వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జీవో 79 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News