జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ

  • ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తప్పొప్పుల సవరణ, అడ్రస్ మార్పు.. దరఖాస్తుల స్వీకరణ
  • షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్
  • జనవరి 6 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తప్పొప్పుల సవరణ, అడ్రస్ మార్పు... వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

2024 జనవరి ఒకటో తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజు నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటా బేస్‌లో అప్‌డేట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.

2024 అక్టోబర్‌కి 18 ఏళ్లు నిండుతున్న వారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే, వీరి దరఖాస్తుల పరిశీలన మాత్రం అక్టోబర్ 1 తర్వాత నిర్వహించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా చేపడతారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18 ఏళ్లు నిండినవారు కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీ పోలింగ్ స్టేషన్ల రీ-అరేంజ్మెంట్, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, ఓటర్ల జాబితాలోని ఫొటోల్లోని లోపాల సవరణ, పోలింగ్‌ కేంద్రాల సరిహద్దుల సవరణ తదితర ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


More Telugu News