ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్.. అర్ధరాత్రికి ఫలితాలు!
- రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఎన్నికలు
- హైకోర్టు జోక్యంతో ఈ రోజు ముగిసిన ఎన్నికలు
- కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ఎన్నికలు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దాదాపు నలభై వేల మంది... 84 పోలింగ్ కేంద్రాలలో, 168 బ్యాలెట్ బాక్సులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదయింది. ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. నేడు రాత్రి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.