మణిపూర్‌లోని ఉఖ్రుల్ పట్టణానికి సమీపంలోని మయన్మార్‌లో భూకంపం

  • రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో సంభవించిన భూకంపం
  • ఉఖ్రుల్ పట్టణానికి 208 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
  • మయన్మార్‌లో ఒకే రోజు రెండు భూకంపాలు నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ పట్టణానికి 208 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూమి ఉపరితలానికి 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన రెండవ భూకంపం ఇదని తెలిపింది. అంతకుముందు మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో అసోంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.

కాగా భారత్ భూకంప జోన్ మ్యాప్ ప్రకారం మణిపూర్ రాష్ట్రం హై-రిస్క్ సీస్మిక్ జోన్‌లో (జోన్ 5) ఉంది. భౌగోళిక నిర్మాణం, స్థానం కారణంగా రాష్ట్రంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. సెప్టెంబర్‌లో ఉఖ్రుల్‌ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీవ్రత పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా హై-రిస్క్ సీస్మిక్ జోన్‌ అయిన జోన్ 5లో అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇక జోన్ 2లో అతి తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి.


More Telugu News