వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమితో మైదానంలోనే నిరుత్సాహపడ్డ కోహ్లీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇదిగో!

  • ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా బాధతో కనిపించిన విరాట్
  • సహచర ఆటగాళ్ల వైపు నడుస్తూ క్యాప్‌తో స్టంప్స్‌ను పడగొట్టిన కింగ్
  • సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారిన ఫైనల్ నాటి వీడియో
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కల చెదరడంతో హృదయ విదారకంగా కనిపించారు. స్వదేశంలో జరిగిన టోర్నమెంట్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి కీలకమైన ఫైనల్ పోరులో భంగపాటుకు గువ్వడంతో ఆటగాళ్లు నైరాశ్యంలో మునిగిపోయారు. ఫైనల్ మినహా ఏ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోలేదు. టీమిండియా ఈ స్థాయిలో రాణించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఏకంగా 765 పరుగులు కొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కోహ్లీ సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ ఫైనల్‌‌‌లో ఓడిపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యాడు. కల చెదిరిన ముఖంతో మైదానంలో కనిపించాడు. నాటి ఫైనల్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. 

టీమిండియా క్రికెట్ ఫ్యాన్‌గా అందరికీ సుపరిచితుడైన ‘ఎక్స్’ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ విచారంతో ఈ వీడియోలో కనిపించాడు. కప్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌ చేసుకుంటుండగా కోహ్లీ బాధతో తన సహచర ఆటగాళ్ల వైపు నడిచి వెళ్తూ క్యాప్‌తో స్టంప్‌లను పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. 


More Telugu News