ఈసారి నాకు టికెట్ లేదని చెప్పడం బాధ కలిగించింది: వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు

  • వైసీపీ నాయకత్వంపై పూతలపట్టు ఎమ్మెల్యే అసహనం
  • ఐదేళ్లు కష్టపడ్డానని వెల్లడి
  • వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యలు
  • దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్నచోటే మార్చుతున్నారని ఆరోపణలు
రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైసీపీ అధినాయకత్వం ఐప్యాక్ సర్వేలపై ఆధారపడుతున్నట్టు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు (పూతలపట్టు నియోజకవర్గం) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇవాళ ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, డబ్బులిస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారు అని వివరించారు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం లేదని, పూతలపట్టు టికెట్ ఆశించవద్దని ముఖ్యమంత్రి చెప్పడం బాధ కలిగించిందని ఎంఎస్ బాబు అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డానని, కానీ తనకు టికెట్ నిరాకరించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. 

టికెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది... దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నా, వారిని మాత్రం మార్చడంలేదని ఆరోపించారు.

సర్వేలో నాపై వ్యతిరేకత ఉందన్న విషయం వెల్లడైందంటున్నారు... నాపై ఏం వ్యతిరేకత ఉందో, నేను చేసిన తప్పేంటో పార్టీ నాయకత్వం తెలియజేయాలి అని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు.


More Telugu News