శతాబ్దాల నాటి పాత స్నేహం మనది... భారత్ పట్ల మాల్దీవుల అధ్యక్షుడి మైత్రీ గీతం

  • ఇటీవల లక్షద్వీప్ అంశంలో భారత్, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం
  • నోరు పారేసుకున్న మాల్దీవుల నేతలు
  • చైనాతో మరింత దోస్తీకి యత్నించిన మాల్దీవుల అధ్యక్షుడు
  • ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం
  • మనది లోతైన చుట్టరికం అంటూ మహ్మద్ ముయిజ్జు ప్రకటన
ఇటీవల లక్షద్వీప్ టూరిజం విషయంలో మాల్దీవుల నేతలు భారత్ పై ఎలాంటి విద్వేషం వెళ్లగక్కారో అందరూ చూశారు. మాల్దీవుల ఎంపీలు బాహాటంగా నోరు పారేసుకోగా, అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కూడా చైనాకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేసి పరోక్షంగా భారత్ పై అక్కసు ప్రదర్శించాడు. 

ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు స్వరం మార్చారు. భారత్ పట్ల మైత్రీ గీతం ఆలపించే ప్రయత్నం చేశారు. "మనది శతాబ్దాల నాటి పాత స్నేహం" అంటూ భారత్ కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. లోతైన చుట్టరికంతో పాటు పరస్పర గౌరవం ప్రాతిపదికన మాల్దీవులు-భారత్ స్నేహం విరాజిల్లుతోంది అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపై కూడా భారత్, ఆ దేశ ప్రజలు శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు దిశగా తమ పయనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

"భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మాల్దీవుల తరఫున, మాల్దీవుల ప్రజల తరఫున భారత రాష్ట్రపతికి, ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ వేర్వేరు సందేశాలు పంపారు" అంటూ మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


More Telugu News