త్వరలో ప్రజల్లోకి వస్తున్నాను: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది.. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామని వ్యాఖ్య
  • విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన
తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని... ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామని సూచించారు. త్వరలో నేను కూడా ప్రజల్లోకి వస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్‌ఎస్ ఎంపీల పైనే ఉన్నాయన్నారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పని చేసేది మనం మాత్రమే అన్నారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ గళం బలంగా వినిపించాలని సూచించారు.

రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్‌ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కె.కేశవరావు మాట్లాడుతూ... విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడుతామని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.


More Telugu News