బీఆర్ఎస్ చచ్చిపోయింది... ఆ పార్టీని ప్రజలు బొంద పెట్టారు: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ తమ మనుగడ కోసమే కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని విమర్శ
  • బీఆర్ఎస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలని సూచన
  • బిల్లా - రంగాలు మోదీని ఏమీ అనడం లేదని వ్యాఖ్య
  • విభజన హామీలు నెరవేరలేదన్న రేవంత్ రెడ్డి
  • లోక్ సభ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని... ఆ పార్టీని ప్రజలు బొంద పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వంటి వారు కేవలం తమ మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిని బట్టే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ రోజు దేశంలో ఓడించాల్సింది ప్రధాని మోదీని అన్నారు. ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. కానీ బిల్లా - రంగాలు మాత్రం మోదీని ఏమీ అనడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అన్నారు.

మోదీని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు... మోదీ ఇచ్చింది లేదని విమర్శించారు. తెలంగాణలో 17కు పదిహేడు స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఓటమితో మతి తప్పి... ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీపై మేం పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు.

విభజన హామీలపై రేవంత్ రెడ్డి

రాష్ట్ర పునర్విభజన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. పునర్విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ఐటీఐఆర్ కారిడార్.. ఇలా ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసిందన్నారు. ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న శ్రద్ద... ప్రజలపై మోదీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ 100 లక్షల కోట్ల అప్పులు తీసుకు వచ్చారన్నారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా కావాల్సిన అవసరం ఉందన్నారు.

లోక్ సభ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నిక నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు రేవంత్ తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకునుకునే వారు ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గాంధీభవన్‌లో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. జనరల్ సీటు అయితే రూ.50 వేలు, ఎస్టీ, ఎస్సీ, వికలాంగులు అయితే రూ.25 వేలతో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరో అరవై రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మన ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తాము ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు.


More Telugu News