క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు తీవ్ర అస్వస్థత.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన హాస్పిటల్

  • విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్‌
  • ‘ఓరల్ ఇరిటేషన్’కు గురయ్యాడని తెలిపిన హాస్పిటల్
  • ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటన
అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్‌లో అతడు చికిత్స పొందుతున్నాడు. మయాంక్ ‘ఓరల్ ఇరిటేషన్’కు గురయ్యాడని, అతడి పెదాలు వాచిపోయాయని ఐఎల్ఎస్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జనవరి 30న హాస్పిటల్‌లో చేరాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించింది.

కాగా మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ అగర్తల నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కాడు. ఫ్లైట్‌లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. గొంతులో వాపు, బొబ్బలు రావడంతో వెంటనే అతడిని విమానం దించి స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ హాస్పిటల్‌కు తరలించారని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఆసుపత్రి నుంచి తన మేనేజర్‌ సహాయంతో మయాంక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

కాగా మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. త్రిపుర వర్సెస్ కర్ణాటక మధ్య అగర్తలలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ అనంతరం సౌరాష్ట్రతో తదుపరి మ్యాచ్ కోసం రాజ్‌కోట్ వెళ్లాల్సి ఉంది. దీంతో మయాంక్ అగర్వాల్ జర్నీలో భాగంగా అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఎక్కాడు.

మయాంక్ తాగింది క్లీనింగ్ రసాయనం అయి ఉంటుందని, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు. అస్వస్థత నేపథ్యంలో మయాంక్ రేపు సూరత్‌లో రైల్వేస్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మనీష్ పాండే ఆడనున్నాడు.


More Telugu News