బీజేపీలో చేరితే వేధింపులు ఆపేస్తామన్నారు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

  • ఏ తప్పూ చేయలేడు, ఎవ్వరికీ తలవంచబోనని తెగేసి చెప్పానన్న ఢిల్లీ సీఎం
  • బీజేపీ కండువా కప్పుకుంటే చాలు.. చేసిన తప్పులన్నీ మాఫీ అంటూ వ్యంగ్యం
  • స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు కట్టడంలో తప్పేముందంటూ ప్రశ్న
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని, రూ.25 కోట్లు ఆశచూపుతూ బీజేపీలో చేరాలని రాయబారాలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఢిల్లీ ఛీప్ వీరేంద్ర సచ్ దేవా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు పంపడమూ జరిగింది. తాజాగా ఆదివారం ఓ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలనే కాదు తనను కూడా బీజేపీలో చేరాలని అడిగారని వెల్లడించారు. బీజేపీ కండువా కప్పుకుంటే వేధింపులు ఆపేస్తామని, కేసులు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు.

బీజేపీ తీర్థం పుచ్చుకుంటే చాలు అప్పటి వరకూ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయంటూ ఎద్దేవా చేశారు. అయితే, తప్పు చేసిన వాళ్లు భయపడి చేరుతారేమో కానీ ఏ తప్పూ చేయని మేమెందుకు బీజేపీలో చేరుతామని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తప్పు చేయనంతకాలం ఎవరికీ తలవంచబోనని బీజేపీకి తెగేసి చెప్పానని వివరించారు. తాను, తన ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు. స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడంలో తప్పేముందని నిలదీశారు.

తనపై, తన పార్టీ నేతలపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇవాళ కాకుంటే రేపైనా ఆ కేసులన్నీ కొట్టుడుపోతాయని స్పష్టం చేశారు. ఏదేమైనా సరే ఢిల్లీలో అభివృద్ధి పనులు ఆగకూదదన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ సొసైటీకి, దేశానికీ సేవ చేస్తూనే ఉంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా వెల్లడించారు.


More Telugu News