ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పేటీఎం సీఈఓ సమావేశం!

  • ఆర్బీఐ ఆంక్షలతో చిక్కుల్లో పడ్డ పేటీఎం, కొనసాగుతున్న నష్ట నివారణ చర్యలు
  • ఇప్పటికే ఆర్బీఐ అధికారులను కలిసిన పేటీఎం ఉన్నతాధికారులు
  • నిబంధనల అమలుకు ప్రణాళికను ఆర్బీఐకి వివరించిన వైనం
ఆర్బీఐ ఆంక్షలతో చిక్కుల్లో పడ్డ పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు పేటీఎం అధికారులు ఆర్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నిబంధనల అమలుపై తమ ప్రణాళికలను వివరించారు. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పర్యవేక్షణ లోపం, నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఆర్బీఐ గత బుధవారం సంస్థపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్త కస్టమర్లను తీసుకోవద్దని, డిపాజిట్ లు స్వీకరించొద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది. సంస్థ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిందని ఎక్స్టర్నల్ ఆడిటర్లు పేర్కొన్నట్టు ఆర్బీఐ తన కంప్లయెన్స్‌ రిపోర్టులో వెల్లడించింది.

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలపై సందేహాలు మొదలయ్యాయి. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో సంస్థ షేర్లు నష్టాలను చవిచూశాయి. లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. 

మరోవైపు, నష్టనివారణ చర్యలకు ఉపక్రమించిన పేటీఎం.. ప్రస్తుత కస్టమర్లకు ఆర్బీఐ ఆంక్షలు వర్తించవని చెప్పింది. యూజర్ డిపాజిట్లు, వాలెట్లు, ఫాస్టాగ్స్, ఎన్‌సీఎమ్‌సీలపై అందోళన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పేటీఎంలో ఎటువంటి లేఆఫ్స్ ఉండవని సంస్థ సీఈఓ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సమస్యకు పరిష్కారం కోసం ఇతర బ్యాంకులతో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు.


More Telugu News