మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్... పార్టీకి అశోక్ చవాన్ రాజీనామా

  • బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లుగా మీడియాలో కథనాలు
  • అశోక్ చవాన్‌కు బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం
  • మహారాష్ట్రలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి షాక్
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ నానా పటోల్‌కు పంపించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు సింగిల్ లైన్‌లో లేఖను పంపించారు. ఆయన బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈ సందర్భంగా అశోక్ చవాన్‌ను మీడియా పలకరించగా.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. కానీ తాను ఇంకా ఏ పార్టీతోనూ మాట్లాడలేదన్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. గత నెలలో మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేవలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది.

అశోక్ చవాన్ పార్టీలో చేరుతున్నారా అని అడిగితే....

అశోక్ చవాన్ మీ పార్టీలో చేరుతున్నారా? అని గతంలో బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి ఫడ్నవీస్ సమాధానమిస్తూ... చవాన్ గురించి తాను మీడియా ద్వారా విన్నానని, కానీ కాంగ్రెస్ నుండి చాలామంది నాయకులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజల్లో ఉండే కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ వైఖరి వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కొంతమంది పెద్ద నాయకులు పార్టీలోకి వస్తారన్నారు.


More Telugu News