ఇంగ్లండ్ ను 434 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా

  • రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు
  • నాలుగు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
  • 557 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 122 రన్స్ కే కుప్పకూలిన ఇంగ్లండ్
  • సొంతగడ్డపై 5 వికెట్లతో రాణించిన జడేజా
రాజ్ కోట్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. 557 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. 

లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. సొంతగడ్డ రాజ్ కోట్  పిచ్ పై జడేజా బంతితో విజృంభిస్తుండడంతో ఇంగ్లండ్ దిక్కుతోచని స్థితిలో వికెట్లు అప్పగించింది. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బౌలర్ మార్క్ ఉడ్ సాధించిన 33 పరుగులే అత్యధికం. చివర్లో వచ్చిన మార్క్ ఉడ్ 15 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. జో రూట్ (7), జానీ బెయిర్ స్టో (4), కెప్టెన్ బెన్ స్టోక్స్ (15) విఫలం కావడం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ప్రభావితం చేసింది. 

ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా... లంచ్ తర్వాతి సెషన్ లో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే టెయిలెండర్లు పోరాడడంతో ఇంగ్లండ్ స్కోరు 100 మార్కు దాటింది. బెన్ ఫోక్స్ 16, టామ్ హార్ట్ లే 16 పరుగులు చేశారు. 

ఇవాళ్టి ఆటలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ హైలైట్ గా నిలిచింది. రాజ్ కోట్ లో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో.... టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఈ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది.


More Telugu News