మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తా: కమలహాసన్

  • డీఎంకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమల్
  • ఈ ఎన్నికలు తమకు మంచి అవకాశమని వ్యాఖ్య
  • ఎన్నికలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో పొత్తుపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కీలక ప్రకటన చేశారు. డీఎంకేతో పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని చెప్పారు. చెన్నై ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు తమకు ఒక మంచి అవకాశమని... ఎన్నికలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తానని కమల్ అన్నారు. 

డీఎంకే, ఎంఎన్ఎం పార్టీల పొత్తుపై గత సెప్టెంబర్ లోనే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హింట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఎంఎన్ఎంతో పొత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉదయనిధికి కమల్ మద్దతుగా నిలిచారు. 2018లో ఎంఎన్ఎం పార్టీని కమల్ స్థాపించారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలు, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలయింది.


More Telugu News