ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై చర్చ?

  • ఢిల్లీలో ఏఐసీసీ సభ్యుడు రణదీప్ సుర్జేవాలా కుమారుడి వివాహం
  • కార్యక్రమానికి సీఎం రేవంత్, భట్టి, శ్రీధర్‌బాబు హాజరు
  • నేడు హైకమాండ్‌తో రాష్ట్ర నేతల భేటీ ఉండొచ్చన్న అంచనా
  • లోకసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చ
ఏఐసీసీ కీలక నేత రణదీప్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం సీఎం రేవంత్ సహా కీలక నేతలు హైకమాండ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. 

లోక్‌సభ అభ్యర్థుల విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్ మినహా 15 స్థానాల్లో అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రెడీ అయ్యిందనీ, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేబినెట్‌లో బెర్తులు దక్కాల్సి ఉన్న నేపథ్యంలో ఈ బెర్తులను భర్తీ చేసి ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పార్టీలోకి ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతున్నాయి.


More Telugu News