వధువుకు పాదనమస్కారం.. వరుడిపై విమర్శల వెల్లువ.. వీడియో ఇదిగో!

  • అస్సాంలో జరిగిన ఓ వివాహంలో అరుదైన దృశ్యం
  • మొదట వరుడికి వధువు పాదనమస్కారం'
  • ఆ వెంటనే వధువు కాళ్లపై పడ్డ వరుడు
  • సంప్రదాయాల్ని ఖాతరు చేయలేదంటూ వరుడిపై విమర్శలు
  • భార్యపై గౌరవంతోనే అలా చేశానంటూ వరుడి వివరణ
కాలంతో పాటు భారతీయ సంస్కృతి, విలువల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వైవాహిక బంధంలో భార్యాభర్తలది సమస్థాయి అన్న భావన వేళ్లూనుకుంది. ఈ విశ్వాసాన్ని యువత రకరకాలుగా వ్యక్తీకరిస్తోంది. గువాహటిలో ఇటీవల జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెళ్లిలో వరుడు ఊహించని విధంగా వధువుకు పాదనమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వరుడిపై ప్రశంసలతో పాటు విమర్శలూ వెల్లువెత్తాయి. 

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వధువు తొలుత సంప్రదాయం ప్రకారం వరుడికి పాదనమస్కారం చేసింది. ఆమె లేవగానే వరుడు ఆమె కాళ్లపై పడి నమస్కారం పెట్టాడు. ఈ సీన్ చూసి పెళ్లికొచ్చిన వారందరూ పెద్దపెట్టున అరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, వీడియో వైరల్ అయ్యాక విమర్శలు కూడా మొదలయ్యాయి. వరుడు ముందు సంప్రదాయాలను గౌరవించాలంటూ హితబోధ చేశారు. 

దీంతో, వరుడు తన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భార్యపై గౌరవం చాటుకున్న తనపై సమాజం విమర్శలు ఎక్కుపెట్టిందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు. అయితే, వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


More Telugu News