వ్యాయామంతో ప్రయోజనాలు పురుషుల కంటే మహిళలకే ఎక్కువట!

  • అమెరికన్ కార్డియాలజీ జర్నల్ లో ఆసక్తికర అధ్యయనం
  • వ్యాయామం వల్ల మహిళల్లో మరణ ముప్పు 24 శాతం తగ్గుతోందని వెల్లడి
  • పురుషుల్లో అది 15 శాతమేనని వివరణ
వ్యాయామంతో ప్రయోజనాలు పురుషుల కంటే మహిళలకే ఎక్కువట!
ఆడ, మగ అని కాకుండా ప్రతి ఒక్కరికీ శారీరక వ్యాయామం తప్పనిసరి. దేహం ఆరోగ్యంగా, సాఫీగా తన జీవక్రియలను నిర్వర్తించడానికి, బలంగా తయారవడానికి వ్యాయామం తోడ్పడుతుంది. అయితే, జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఓ కథనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 

వ్యాయామం వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేయడం, స్పోర్ట్స్ లో పాల్గొనడం, రన్నింగ్ చేయడం వంటి ఎక్సర్ సైజులు పురుషులు, స్త్రీలు సమానంగా చేసినా... మహిళలకే అధిక లాభం కలుగుతోందట. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మహిళల్లో అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గుతుండగా... అంత సమయం పాటు వ్యాయామం చేసిన పురుషుల్లో అకాల మరణం ముప్పు 15 శాతం మాత్రమే తగ్గుతోందని అధ్యయనంలో పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేసే మహిళల్లో గుండెపోటు, పక్షవాతం సమస్యలతో మరణించే ముప్పు 34 శాతం తగ్గుతుండగా, నిత్యం వ్యాయామం చేసే పురుషుల్లో ఇది కేవలం 14 శాతం మాత్రమేనని పరిశోధకులు వివరించారు. 

మహిళలు వారానికి 140 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అకాల మరణాల నుంచి 18 శాతం ముప్పు తప్పించుకుంటుండగా, అదే స్థాయిలో ముప్పు తప్పించుకోవడానికి పురుషులు 300 నిమిషాల పాటు, అంతకంటే ఎక్కువ సమయం పాటు వ్యాయామం చేయాల్సి వస్తుందట.

ఎక్సర్ సైజుల్లో రకాలు, వ్యాయామ వేగం, వ్యాయామ సమయం...  ఇలా అన్ని విధాలుగా చూసినా మహిళలకే అత్యధిక లాభం కలుగుతున్న నేపథ్యంలో... మహిళలు ఏ కొంచెం తీరిక దొరికినా వాకింగ్ చేయడమో, ఇంట్లోనే ఉండి తోట పని చేసుకోవడమో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలోనే మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందే వీలుండడంతో మహిళలు వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.


More Telugu News