బీఆర్ఎస్‌లో చిచ్చురేపిన బీఎస్పీతో పొత్తు.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!

  • గత ఎన్నికల్లో కోనప్పపై పోటీ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
  • తనతో మాటమాత్రమైనా చెప్పకుండా కేసీఆర్ పొత్తు నిర్ణయం తీసుకున్నారని కోనేరు కినుక
  • నిన్న కార్యకర్తలతో రహస్య సమావేశం
  • ఈ నెల 12, లేదంటే 15న కాంగ్రెస్ తీర్థం
బీఆర్ఎస్‌లో చిచ్చురేపిన బీఎస్పీతో పొత్తు.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల ముందు వరుసగా ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క చూపులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కిందిస్థాయి నేతలు ఎప్పుడో తట్టాబుట్టా సర్దేసుకున్నారు. కొందరు కాంగ్రెస్‌తోనూ, మరికొందరు బీజేపీతోనూ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి మరోషాక్ తగిలింది.

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు ఆ పార్టీలో కాకరేపింది. పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12, లేదా 15న ఆయన హస్తం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కోనేరుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి నడవాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించుకోవడంపై కోనేరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చానని, పొత్తు విషయమై తనతో మాటమాత్రంగానైనా చెప్పలేదని కోనప్ప కోపంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ వీడాలని నిర్ణయించుకున్న ఆయన నిన్న కార్యకర్తలతో రహస్యంగా సమావేశమయ్యారు. నేడో, రేపో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం.


More Telugu News