భారత్‌తో దౌత్యవివాదంతో ప్రతికూల ప్రభావం.. మాల్దీవుల మాజీ అధ్యక్షుడి ఆందోళన

  • భారత్‌లో పర్యటిస్తున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్
  • భారతీయుల బాయ్‌కాట్ కారణంగా మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం ఉందని వ్యాఖ్య
  • ఎప్పటిలాగే భారతీయులు తమ దేశంలో పర్యటించాలని విన్నపం
భారత్‌తో దౌత్య వివాదం మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన భారత్‌కు తమ దేశ ప్రజల తరపున క్షమాపణలు కూడా చెప్పారు. మాల్దీవుల పర్యాటకాన్ని బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. 

‘‘ఈ దౌత్య వివాదం మాల్దీవుల పర్యాటకంపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. ఈ విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నా. పరిస్థితులు ఇలాంటి మలుపు తీసుకున్నందుకు మాల్దీవుల ప్రజలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు మా దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నాం. మా ఆతిథ్యంలో ఎటువంటి మార్పు ఉండదు’’ అని నషీద్ తెలిపారు.  

మాల్దీవులతో భారత్‌ ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్ తెలిపారు. భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని తమ దేశం పట్టుబడుతున్నా భారత్ తమను బలవంతం పెట్టలేదని చెప్పుకొచ్చారు. చర్చల ప్రతిపాదనతో హుందాగా వ్యవహరించిందన్నారు. 

మాల్దీవులు, చైనా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై కూడా రషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది అసలు రక్షణ రంగం ఒప్పందం కాదని, కేవలం కొన్ని పరికరాల కొనుగోలు కోసం కుదిరిన ఒప్పందమని చెప్పారు. 

చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులు దశాబ్దాలుగా భారత్‌తో ఉన్న సంబంధాలను పక్కకు పెడుతున్న విషయం తెలిసిందే. మాల్దీవుల అధ్యక్షులు అధికారం చేపట్టాక తొలి విదేశీ పర్యటనపై భారత్‌కు రావడం ఆనవాయితీగా వస్తుండగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు మాత్రం ఈ సంప్రదాయానికి తెరదించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయన తొలుత టర్కీలో పర్యటించారు. అనంతరం చైనాను సందర్శించారు.


More Telugu News