విమానం ఇంజిన్‌లో నాణేలు విసిరిన ప్రయాణికుడు!

  • మార్చి 6న సదరన్ చైనా ఎయిర్ లైన్స్‌లో ఘటన
  • సాన్యా నుంచి బీజింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఘటన వెలుగులోకి
  • నిందితుడిని ప్రశ్నించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది
  • అదృష్టం కోసం ఇంజిన్‌లో నాణేలు విసిరానని నిందితుడి వివరణ
  • ఘటన కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిన విమానం
ఓ విమాన ప్రయాణికుడి మూఢనమ్మకం తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టింది. విమానం 4 గంటల ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమైంది. చైనాలో ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్చి 6న సాన్యా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు. మూఢనమ్మకంతో అతడు అదృష్టం కోసమని విమానం ఇంజిన్‌లో నాణేలు జారవిడిచాడు. 

చైనా మీడియా కథనాల ప్రకారం, నిందితుడు సుమారు మూడు నాలుగు నాణేలు విమానం ఇంజిన్‌లో విసిరినట్టు తెలిసింది. అనుమానితుణ్ణి ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నిందితుడు తన తప్పును అంగీకరించినట్టు కూడా వెల్లడైంది. దీంతో, నిర్వహణ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో, దాదాపు నాలుగు గంటల జాప్యం అనంతరం విమానం బయలుదేరింది. తనిఖీల సందర్భంగా విమానం ఇంజిన్‌లో నాణేలు లభించినట్టు ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. అయితే, ఎన్ని నాణేలు లభించాయో మాత్రం వెల్లడించలేదు. ఇక నిందితుడి వివరాలు కూడా ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు. 

మరోవైపు, ఘటనపై సదరన్ చైనా ఎయిర్‌లైన్స్ ఘాటుగా స్పందించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్టు వెల్లడించింది. వీటి వల్ల ప్రయాణికులు, విమానం భద్రతకు తీవ్ర ప్రమాదమని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, కంపెనీ తన ప్రకటనలో ఏ ఒక్క ఘటననూ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే, రెండేళ్ల క్రితం కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. ఓ ప్రయాణికుడు అదృష్టం కోసమంటూ కొన్ని నాణేలను ఇంజిన్‌లో విసిరాడు. అయితే, విమానం బయలుదేరే ముందే కొందరు సిబ్బంది రన్‌వేపై పడున్న కొన్ని నాణేలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.


More Telugu News