వందో టెస్టులో డకౌట్ అయిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌!

  • అశ్విన్ కంటే ముందు ఎనిమిది మంది క్రికెటర్ల పేరిట‌ ఈ రికార్డ్‌
  • దిలీప్ వెంగ్‌సర్కార్, ఛ‌టేశ్వ‌ర్ పుజారా త‌ర్వాత మూడో భార‌త క్రికెట‌ర్
  • ధ‌ర్మ‌శాల టెస్టులో భారీ ఆధిక్యం దిశ‌గా రోహిత్ సేన‌
ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్‌తో భార‌త్ 5 మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా చివ‌రిద‌యిన ఐదో టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్‌ టీమిండియా దిగ్గ‌జ‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే ఇది అత‌నికి వందో టెస్టు మ్యాచ్‌. ఇలా 100వ టెస్టు ఆడుతున్న 14వ‌ భార‌త క్రికెట‌ర్‌, 3వ స్పిన్న‌ర్‌. అయితే, ఈ ప్ర‌త్యేక‌మైన మ్యాచ్‌లో అశ్విన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తాను ఆడుతున్న 100వ టెస్టులో డకౌట్ అయ్యాడు. టీమిండియా వికెట్‌ కీప‌ర్ ధ్రువ్ జురెల్ ఔట‌యిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ అశ్విన్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్న అశ్విన్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. 

అయితే, అశ్విన్ కంటే ముందు తాము ఆడిన‌ 100వ టెస్టులో పలువురు ఇతర క్రికెటర్లు కూడా డకౌటయ్యారు. తమ మైల్‌స్టోన్‌ 100వ టెస్టులో డకౌటైన క్రికెటర్లలో అశ్విన్‌ది 9వ స్థానం. ఇక భార‌త ఆట‌గాళ్ల విష‌యానికి వ‌స్తే అశ్విన్ మూడో క్రికెట‌ర్‌. అత‌నికి కంటే ముందు దిలీప్ వెంగ్‌సర్కార్, ఛ‌టేశ్వ‌ర్ పుజారా ఉన్నారు. వందో టెస్టులో డ‌కౌటైన తొలి భార‌త ఆట‌గాడిగా 1988లో దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డుకెక్కారు. ఆ త‌ర్వాత పుజారా (2023) కూడా త‌న వందో టెస్టులో డ‌కౌట‌య్యాడు.  

అశ్విన్ కంటే ముందు ఎనిమిది మంది క్రికెటర్ల పేరిట‌ ఈ చెత్త రికార్డు
ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ కంటే ముందు టెస్టుల్లో ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆట‌గాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. దిలీప్ వెంగ్‌సర్కార్, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, అలన్ బోర్డర్, కౌర్ట్నీ వాల్ష్, మార్క్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెకల్లమ్ ఈ చెత్త రికార్డును క‌లిగి ఉన్నారు. వీళ్లలో వాల్ష్, అశ్విన్ మాత్రమే బౌలర్లు కాగా.. మిగతా వాళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లే కావ‌డం గ‌మ‌నార్హం.

37 ఏళ్ల అశ్విన్ ఇండియా తరఫున 100 టెస్టులు ఆడిన 14వ భారత ఆట‌గాడిగా, అతిపెద్ద వ‌య‌స్కుడిగా నిలిచాడు. ఇక ధ‌ర్మ‌శాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11.4 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. బెన్ ఫోక్స్, టామ్ హ‌ర్ట్లీ, మార్క్ వుడ్, అండ‌ర్స‌న్‌ల‌ను పెవిలియ‌న్ పంపించాడు. ఈ సిరీస్‌లో కూడా అశ్విన్ బాగానే రాణిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 21 వికెట్లు తీసి, అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన‌ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అటు రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన నాల్గో టెస్టులో అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. అనిల్ కుంబ్లే త‌ర్వాత టెస్టుల్లో 500 వికెట్ల మార్క్‌ను అందుకున్న రెండో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. 

ఇదిలాఉంటే.. ధ‌ర్మ‌శాల టెస్టులో రోహిత్ సేన ఇప్ప‌టికే 255 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 218 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 8 వికెట్లు కోల్పోయి 473 ప‌రుగులు చేసింది. భార‌త ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (103), శుభ‌మన్ గిల్ (110) శ‌త‌కాలు న‌మోదు చేయ‌గా.. ప‌డిక్క‌ల్ (65), స‌ర్ఫ‌రాజ్ (56), య‌శ‌స్వి జైశ్వాల్ (57) హాఫ్ సెంచ‌రీలు బాదారు.


More Telugu News