ప్రధాని మోదీ జోక్యంతో తప్పిన రష్యా అణుదాడి ముప్పు!

  • అమెరికా అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ వార్తాసంస్థ సీఎన్ఎన్ సంచలన కథనం
  • వరుస ఎదురుదెబ్బలతో రష్యా అణుదాడి చేయొచ్చని భావించిన అమెరికా
  • పుతిన్ మనసు మార్చేందుకు భారత్, చైనా సాయం కోరిన వైనం
  • ఇరు దేశాధినేతల జోక్యంతో రష్యా వెనక్కు తగ్గిందన్న అమెరికా అధికారులు
ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి సిద్ధమైందా? చివరి నిమిషంలో వెనక్కు తగ్గిందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌ సహా పలు మిత్ర దేశాల జోక్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చుకున్నారని ప్రముఖ వార్తాసంస్థ సీఎన్ఎన్ తాజాగా ప్రచురించింది. మోదీ, ‌జిన్ పింగ్ చొరవతో పుతిన్.. అణుదాడి ఆలోచనను పక్కన పెట్టారని అమెరికా అధికారులు పేర్కొనట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. 

సీఎన్ఎన్ కథనం ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి తప్పదని అమెరికా భావించింది. ఉక్రెయిన్ చేతిలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న రష్యా.. అణుదాడికి దిగే యోచనలో ఉందని అమెరికా వర్గాలు భావించాయి. ఉక్రెయిన్ సేనలు కీలకమైన ఖెర్సన్ నగరాన్ని చుట్టుముట్టినప్పుడు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఖెర్సన్ ను కోల్పోతే రష్యా అణుదాడికి దిగొచ్చనే భయాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్ డర్టీ బాంబులను వినియోగిస్తోందన్న సాకుతో రష్యా అణుబాంబును ప్రయోగించవచ్చని అమెరికా ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు కూడా ప్రారంభించాయి. 

అణు సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తొలుత ఇతర దేశాల సాయాన్ని కోరింది. ‘‘రష్యాతో అణుదాడి ఆలోచనను విరమింపచేయాలని మేము ఇండియా సహా పలు దేశాలకు విజ్ఞప్తి చేశాం. వారి మాటతోనైనా రష్యా వెనక్కు తగ్గొచ్చనేది మా ఆలోచన. ఆ తరువాత భారత్, చైనా జోక్యంతో రష్యా ఆలోచనల్లో మార్పు వచ్చింది’’ అని అమెరికా అధికారులు పేర్కొన్నట్టు సీసీఎన్ఎన్ ప్రచురించింది. 

రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్ తొలి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ప్రధాని మోదీ గతేడాది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో స్పష్టం చేశారు.


More Telugu News